Latest News: News Newsమరింత విలువైన సమాచారం కొరకు ఈ లింక్ క్లిక్ చేసి మన Forum లో Register అవండి. NewsRegister అయిన తరువాత Account ని Actvate చేయటం మరిచి పోకండి, Activate చేయుటకు మీ Mail చూడండి.

Sunday, September 4, 2011

ఆచార్యదేవోభవ

సోర్సు      హరివిల్లు


అఆలు నేర్పిన ఉపాధ్యాయుడినుంచి విద్యాభ్యాసం పూర్తయ్యేవరకు పాఠం చెప్పిన ప్రతిఒక్కరూ గురువే. గురువంటే మార్గదర్శి. ద గైడ్‌. జీవనయానంలో ఉన్నతస్థానానికి ఎదగాలంటే అక్షరాలు దిద్దిననాటినుంచి వెన్నంటి ఉండి, తీర్చిదిద్ది ఉత్తమ పౌరునిగా, ఉత్తమ వ్యక్తిగా ఎదగడానికి దోహదపడే శక్తియుక్తుల్ని నేర్పేవారే ఆచార్యులు. అందుకే పూర్వం తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకు ఇచ్చి ఆచార్యదేవోభవ అన్నారు. అసలు గురువును బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో పోల్చారంటే వారికి లభించిన గౌరవం, మన్నన అర్థం చేసుకోవాలి.
పురాణేతిహాసాల్లో ఓ విశ్వామిత్రుడు, ఓ ద్రోణాచార్యుడు తమ శిష్యులైన రామలక్ష్మణులను, అర్జునుడిని ఎలా తీర్చిదిద్దారో, వారిమధ్య గురుశిష్య సంబంధం ఎలా పరిఢవిల్లిందో తెలుసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఆనాటితో పోలిస్తే….ఇప్పుడు గురుశిష్య సంబంధాలు గతితప్పాయి. వారిమధ్య అప్పుడు గౌరవం, మన్నన ఉంటే ఇప్పుడు ఆయావర్గాల మధ్య స్నేహం పెరిగింది. ఆధునికభారతదేశంలో గురువంటే ఎలా ఉండాలో, శిష్యులపై ఎలాంటి ముద్రవేయాలో ఆచరించి చూపిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఈ క్షణాన తలుచుకోవాల్సిందే. ఆయన చూపినబాటలో ఉపాధ్యాయ, విద్యార్థివర్గం పయనించాల్సిందే.

మన దేశ తొలి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ సెప్టెంబర్‌ 5న జన్మించారు. ఆయన జన్మించిన రోజును దేశవాసులు ‘టీచర్స్‌ డే’గా జరుపుకుంటున్నారు. 1962 నుంచి 1967 వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు రాధాకృష్ణ. ఆ సమయంలో కొందరు విద్యార్థులు, స్నేహితులు రాధాకృష్ణన్‌ను కలిసి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు.
తన జన్మదినోత్సవానికి బదులు ఈ రోజును టీచర్స్‌డేగా జరుపుకోవాలని కోరారు. అప్పటి నుంచి రాధాకృష్ణన్‌ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. మన దేశంలో టీచర్స్‌ డేకు సెలవు లేదు. ఈ రోజును ‘సెలబ్రేషన్స్‌ డే’గా ఘనంగా జరుపుకుంటున్నారు. పాఠశాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున కొన్ని పాఠశాలల్లో విద్యార్థులనే ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించేటట్టు చేస్తారు. దీంతో విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల భయం పోయి వారి పట్ల గౌరవ, మర్యాదలు పెంపొందుతాయి.
సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప వేదాంతిగా పేరుతెచ్చుకున్నారు. 1888 సంవత్సరం సెప్టెంబర్‌ 5న జన్మించిన ఆయన 1975 ఏప్రిల్‌ 17న మృతిచెందారు. ఇక ఆయన దేశ తొలి ఉపాధ్యక్షుడిగా 1952 నుంచి 1962 వరకు పనిచేయగా దేశ అధ్యక్షుడిగా1962 నుంచి 1967వరకు పనిచేశారు. రాధాకృష్ణ తన వేదాంత పద్ధతులతో పాశ్చాత్య దేశాలు, మన దేశానికి మధ్య వారధిని నిర్మించేందుకు ప్రయత్నించారు.
ప్రారంభ జీవితం, విద్య…
సర్వేపల్లి రాధాకృష్ణ మద్రాస్‌ రెసిడెన్సీలోని తిరుత్తణి ప్రాంతంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో (ప్రస్తుత తమిళనాడులోని తిరువల్లూర్‌ జిల్లా) ఆయన జన్మించారు. ఆయన మాతృభాష తెలుగు. ఆయన తల్లి పేరు సీతమ్మ. ఆయన బాల్య జీవితం తిరుత్తణి, తిరుపతి ప్రాంతాల్లో గడిచింది. ఆయన తండ్రి రెవిన్యూ అధికారిగా పనిచేశారు. తిరుత్తణిలోని ప్రైమరీ బోర్డు హైస్కూల్‌లో ప్రాథమిక విద్య ముగియగా, తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్‌ ఎవాంజెలికల్‌ లూథర్‌ మిషన్‌ స్కూల్‌లో సైతం ఆయన చదువుకున్నారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. అనంతరం ఎం.ఎ. పూర్తిచేశారు. ఇక డాక్టర్‌ రాధాకృష్ణన్‌ అనుకోకుండా వేదాంతం చదువుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వేదాంతంపై ఎంతో ఆసక్తి కనబరిచి అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో వేదాంతంపై ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనలు ఎందరినో ప్రభావితుల్ని చేశాయి.
గొప్ప ప్రొఫెసర్‌గా…
కోల్‌కతా యూనివర్సిటీలోని కింగ్‌ జార్జ్‌ వి చైర్‌ ఆఫ్‌ మెంటల్‌ అండ్‌ మోరల్‌ సైన్స్‌లో సర్వేపల్లి రాధాకృష్ణ ప్రొఫెసర్‌గా 1921 నుంచి 1935 వరకు పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో 1936 నుంచి 1952 వరకు పనిచేయడం విశేషం. ఆయన ఉత్తమ అధ్యాపకుడిగా విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేస్తూ పలువురి ప్రశంసలనందుకున్నారు. ఆయన ప్రతిభకుగాను నైట్‌హుడ్‌(1931), భారతరత్న (1954), ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ (1963) అవార్డులను అందజేశారు. ఇక 1909లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. అనంతరం మైసూర్‌ యూనివర్సిటీ వేదాంతం ప్రొఫెసర్‌గా అతన్ని నియమించింది.
ఈ సమయంలో ఆయన ప్రముఖ జర్నల్స్‌ ద క్వెస్ట్‌, జర్నల్‌ ఆఫ్‌ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆప్‌ ఎథిక్స్‌కు ఎన్నో ఆర్టికల్స్‌ రాశారు. ఆయన తొలిసారిగా ‘ది ఫిలాసఫి ఆఫ్‌ రవీంద్రనాథ్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన ఠాగూర్‌ ఫిలాసఫీని ఉత్తమ వేదాంతంగా పేర్కొన్నారు. ఇక రాధాకృష్ణన్‌ ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా 1931 నుంచి 1936 వరకు పనిచేశారు. 1939లో పండిత్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య బనారస్‌ హిందూ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా చేయాలని రాధాకృష్ణన్‌ను విజ్ఞప్తిచేశారు. దీంతో రాధాకృష్ణన్‌ బనారస్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి 1948 సంవత్సరం జనవరి వరకు పనిచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డాక్టర్‌ రాధాకృష్ణన్‌ యునెస్కోలో ఇండియా ప్రతినిధిగా 1952 వరకు కొనసాగారు. ఇక 1952లో దేశ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత దేశ రెండవ అధ్యక్షుడిగా 1962 నుంచి 1967 వరకు పనిచేసి ఎంతో పేరుతెచ్చుకున్నారు.
గురువును దైవంగా భావించి…
అనాదిగా మన దేశంలో గురువును దైవంగా భావించారు. తల్లి,తండ్రి, గురువులు దైవంతో సమానమని మన పెద్దలు చెప్పారు. ‘గురు బ్రహ్మ…గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ… గురు సాక్షాత్‌ పరబ్రహ్మ… తసై్మ శ్రీ గురవే నమః’ అని గురువును కీర్తించారు. గురువు త్రిమూర్తులతో సమానమని గురువును అభివర్ణించారు. ఒకప్పుడు మన దేశంలో గురుకులాలు ఉండేవి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ గురుకులాల్లో చిన్నవయసులోనే చేర్పించేవారు. అక్కడ గురువులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి కొంతకాలం తర్వాత వారిని తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపించేవారు. పురాణ ఇతిహాసాల్లో కూడా గురువులను చాలా గొప్పగా చూపించారు.
శ్రీరాముడు, లక్ష్మణుడు చిన్నతనంలో గురువు విశ్వామిత్రుడి వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అడవుల్లోకి వెళ్లి రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వద్ద ఉన్నారు. అస్త్ర శస్త్ర విద్యలతోపాటు సకల విద్యలు విశ్వామిత్రుడు నేర్పించారు. వారికి అన్ని విద్యలు నేర్పిన తర్వాత తిరిగి తండ్రి దశరథుడి వద్దకు పంపించారు. అదేవిధంగా ద్రోణాచార్యుడు కౌరవ, పాండవులకు సకల శాస్త్రాలు, అస్తశ్రస్త్ర విద్యలు నేర్పించారు. పాండవుల్లో అర్జునుడికి విలు విద్యను, భీముడికి గదాయుద్ధంలో శిక్షణనిచ్చారు. పాండవులు, కౌరవులను అన్ని విద్యలను నేర్పించిన గురువు ద్రోణాచార్యుడు. ఇక ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహాన్ని రూపొందించి ఆయన్ని తన గురువుగా భావించి సొంతంగా అస్తశ్రస్త్రాలు నేర్చుకున్నాడు. అన్ని విద్యల్లో ఆరితేరాడు.
ఈ విధంగా పురాణ ఇతిహాసాల్లో గురువులకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. ఆనాడు పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా గురుకులాల్లో ఉంటూ గురువు వద్ద అన్ని విద్యలు నేర్చుకునేవారు. పూర్తిగా విద్యాబుద్ధులు నేర్చుకున్న అనంతరం గురువు వారిని తల్లిదండ్రులకు పంపించేవారు. ఇక నేడు కాలం మారింది. గురుశిష్యుల మధ్య అనుబంధం కూడా మారింది. నేడు విద్యార్థులు గురువులకు సరైన గౌరవ, మర్యాదలు ఇవ్వడం లేదు. అదేవిధంగా కొందరు గురువులు విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పడంలో పూర్తి శ్రద్ధవహించడం లేదు. కాలేజీలలో గురువులను ఎదిరించి మాట్లాడుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రతిఏటా సెప్టెంబర్‌ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవంనాడు గురుశిష్యుల పవిత్రబంధం గురించి తెలియచేసుకోవాలి. విద్యార్థులు గురువులకు ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదలను ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గురువులు కూడా విద్యార్థులను తీర్చిదిద్దడంలో పూర్తి శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకతను కూడా ఈ దినోత్సవం గుర్తుచేస్తుంది.

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే…


దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చరిత్రలోకెక్కారు. దేశంలోని తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన ఆమె ఉపాధ్యాయురాలిగా మహిళలకు విద్యాబోధన చేశారు. ఇక స్ర్తీ విద్య కోసం పాటుపడిన సంఘసేవకురాలు సావిత్రిబాయి. ప్రముఖ సంఘసేవకుడు జ్యోతిరావ్‌పూలే భార్య సావిత్రిబాయి ఆ కాలంలో మహిళా విద్య గురించి ఎంతో తపించారు. దళిత వర్గంలో పుట్టిన ఈ దంపతులు బ్రిటీష్‌ వారి కాలంలో మహిళల హక్కుల కోసం పోరాడారు. ఇక సావిత్రిబాయి పూలే దళితుల కోసం 1852లో మొదటి పాఠశాలను కూడా ప్రారంభించడం విశేషం.
ఆ కాలంలో స్ర్తీలు బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ సావిత్రిబాయి పూలే బాలికలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి ఛాందసులు ఆమెపై కుళ్లిన గుడ్లు, ఆవు మాంసం, టమాటాలు, రాళ్లు విసిరి హింసించేవారు. కానీ సావిత్రిబాయి వీటికి జంకకుండా ధైర్యంగా తిరిగేవారు. ఆమె భర్త జ్యోతిరావ్‌ పూలే తన భార్యకు పూర్తి అండగా ఉంటూ ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఆమె దేశంలోనే మహిళల కోసం 1848లో తొలి పాఠశాలను ప్రారంభించి అక్కడ మొదటి ఉపాధ్యాయినిగా పాఠాలు బోధించారు. మొదట వివిధ కులాలకు చెందిన తొమ్మిది బాలికలు ఆమె పాఠశాలలో చేరి చదువుకున్నారు. ఆ తర్వాత సమాజంలో కొంత మార్పు వచ్చి తల్లిదండ్రులు తమ అమ్మాయిలను చదువుకునేందుకు పాఠశాలకు పంపించడం ప్రారంభించారు. దీంతో సావిత్రిబాయి మహిళల కోసం మరో ఐదు పాఠశాలలను ప్రారంభించడం విశేషం. చివరికి బ్రిటీష్‌ ప్రభుత్వం స్ర్తీ విద్య కోసం ఆమె కృషిని గుర్తించి ఘనంగా సత్కరించింది.


0 comments:

Post a Comment

Search This Blog

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Bluehost Coupons