Latest News: News Newsమరింత విలువైన సమాచారం కొరకు ఈ లింక్ క్లిక్ చేసి మన Forum లో Register అవండి. NewsRegister అయిన తరువాత Account ని Actvate చేయటం మరిచి పోకండి, Activate చేయుటకు మీ Mail చూడండి.

Sunday, August 14, 2011

మనకి ఎంత దేశభక్తి? నల్లమోతు శ్రీధర్ వ్యాసం

                                                                                                                సోర్సు:  నల్లమోతు శ్రీధర్

మరో ఆగస్ట్ 15 వచ్చేసింది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినరోజేమో తెలియదు కానీ పని నుండి మరో సెలవు రోజు జమైనందుకు ఊపిరి పీల్చుకుంటున్నాం. మనలోనూ చాలా దేశభక్తి ఉంది, కానీ ఏం చేస్తాం పొట్టకూటి కోసం పడే తిప్పల్లో ఎక్కడో అడుగుకి చేరుకుపోయింది. ప్రతీ ఏటా ఈ పండుగ వస్తూనే ఉంది.. టెలివిజన్ సెట్లలో, రేడియోల్లో ఉద్వేగభరితమైన సంగీతాన్నీ, జాతీయ గీతాలను ఆస్వాదిస్తూ మన రోమాలు నిక్కబొడుచుకుంటూనే ఉంటున్నాయి. వందేమాతరం అంటూ రెహ్మాన్ గీతంలో ఆసేతు హిమాచలాన్ని వీక్షిస్తూ ఎంత గొప్పదేశమో అని

పులకించిపోతున్నాం. కాలం ఆగదు కదా.. కాలెండర్ లో తేదీ మారింది. తేదీతో పాటు ఉత్సాహమూ చప్పబడిపోయింది. మళ్లీ రొటీన్ లైఫ్ మొదలైంది.
రొటీన్ లైఫ్ లీడ్ చేస్తున్నా మనలో చేవ తగ్గలేదు, ఇప్పటికీ దేశం పేరెత్తితే ఉప్పొంగిపోతున్నాం.. ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణం గెలిస్తే పట్టలేని ఆనందం. భారతజట్టు క్రికెట్ లో ప్రపంచ కప్ గెలిస్తే ఎనలేని ఆనందం, దారుణంగా ఓడిపోతే శాపనార్థాలు. రాజకీయల నాయకుల్ని చూసి అసహ్యించుకుంటున్నాం, సోమరిపోతు అధికారుల్నితిట్టుకుంటున్నాం.. పేపర్ బాయ్ నుండి టీవీ సీరియల్ లో క్యారెక్టర్ వరకూ ఎవరినీ వదలకుండా వారు వారు పోషిస్తున్న పాత్రలు, ఉద్యోగ ధర్మాన్నిచీల్చి చెండాడుతున్నాం. ప్రపంచంలో మనంత గొప్ప విమర్శకులు ఉండరు. వ్యవస్థ పాడైపోయినందుకు గంటల తరబడి విశ్లేషణలు చేసి కొండని తవ్వి ఎలుకను పట్టినట్లు "ఈ దేశాన్ని మనం బాగుచెయ్యలేమండీ" అని పెదవి విరిచి పడకేస్తాం.
దేశమంటే, సమాజమంటే అదో బ్రహ్మపదార్థం.. మన చేతిలో ఏదీ ఉండదు అన్నంత నిర్లిప్తత. "నీకు చేతనైంది ఏదైనా ఒక్క మంచి పని చెయ్యరా బాబూ" అంటే.. "మనమొక్కళ్లం మంచిగా ఉంటే అంతా బాగవుతుందా" అన్న బోడి లాజిక్ లు. ఏం ఎందుకు బాగు కాదు? అసలు చేతనైనంత, మనకు వీలుపడినంత సమాజానికో, దేశానికో, పక్కవాడికో మంచి చెయ్యడానికి అంత బద్ధకం ఎందుకు? "ఈ దేశం ఎప్పుడు బాగుపడాలండీ" అంటూ వ్యంగ్యాలు సంధించే బదులు కనీసం దేశాన్ని బాగు చెయ్యకపోయారు మనల్ని మనమైనా బాగుచేసుకోలేమా? ఆఫీస్ కి వెళతాం, "పనిపూర్తయిందా", "ఈ జాబ్ లో ఉంటే వచ్చే ఏడాదికి ఎంత పే వస్తుంది, మరో జాబ్ మారితే బాగుంటుందేమో? వద్దులే అక్కడ వర్క్ ఎక్కువుంటుందేమో".. ఇవే పనికిమాలిన పని తప్పించుకునే ఆలోచనలు. జపాన్ చాలా గొప్పదేశమండీ, చైనా ఎంత డెవలప్ అయ్యిందో చూశారా.. టీవీలో స్టాటిస్టిక్స్ చూసి తామేదే రీసెర్చ్ చేసి కనిపెట్టినట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు. అవి డెవలప్ అయ్యాయి అంటే అక్కడి పౌరులు తమ పని తాము శ్రద్ధగా చేసుకుపోతున్నారు. వారేమీ ఓవర్ టైమ్ చెయ్యడం లేదు. తమకు వచ్చే జీతానికి సరిపడా తాము కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రొడక్టివిటీ వల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అని, తాము కష్టపడితే దేశానికి సముద్రంలో నీటి బొట్టంత అయినా లాభం చేకూరుతుందన్న కనీస స్పృహ వారికుంది. ప్చ్.. మనం మాత్రం ఎప్పుడు సెలవు వస్తుందా అని చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటాం. స్వంత పనే, కూడు పెడుతున్న పనే శ్రద్ధగా చేయనంత బద్ధకస్తులమైతే మనం దేశం గురించి బాధ్యత ఎక్కడ ఫీల్ కాగలం?
"దేశాన్ని ఉద్దరించాలంటే ఏం చేయాలండీ" అంటూ ప్రశ్నిస్తారు కొంతమంది? ఎంత కన్ ఫ్యూజన్ లో ఇరుక్కున్నాం. చేయాలన్న తపన ఉండాలే కానీ మనం చేసే ప్రతీ పనీ చిత్తశుద్ధితో చేస్తే అది దేశానికి సేవ చేసినట్లు కాదా? ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవడం దగ్గర్నుండి అనాధలకు సేవ చెయ్యడం వరకూ ఎన్ని రకాల సేవలు ఉన్నాయి. అవన్నీ మనమెక్కడ చేస్తాం అంటూ భేషజం అడ్డు వస్తుంది. ఇంకేం దేశాన్ని, నాయకుల్ని, పక్కింటి వాడిని సణుక్కుంటూ దుప్పటి ముసుగేద్దాం. మనకు చేతనైంది అదే కదా! ఒక్క మంచి పనిని చెయ్యకపోగా మంచి పనులకు మాటలతోనైనా మోరల్ సపోర్ట్ ఇచ్చే ఓపెన్ మైండ్ ఉండదే.. ఇంకా సమాజాన్ని విమర్శించే హక్కు మనకెక్కడిది? ఎవరైనా మంచి పని చేస్తే కాళ్లు పట్టి మరీ వెనక్కి లాగి శాడిజం ప్రదర్శించుకుంటాం. నిర్లక్ష్యంగానే పెరిగాం, నిర్లక్ష్యంగానే జీవితం సాగిద్దాం.. ఎవరెట్లా పోతే మనకెందుకు! ఇలాంటి పండుగలొచ్చినప్పుడు నాలుగు స్వీట్లు తిని, FBలోనో, Orkutలోనో, మెయిల్ లోనో ఆవేశపూరితమైన కొటేషన్లని, వాల్ పేపర్లని పంపించుకుని అలా చేయడం వల్ల మనకేదో దేశభక్తి వంటబట్టినట్లు భ్రమపడుతూ, టైమ్ ఉంటే బ్లాక్ లో టిక్కెట్ కొని సినిమాకెళ్లి, రాత్రికి వీలైతే గ్లాసులు గల్లుమనిపించి తొంగుందాం…
మేరా భారత్ మహాన్! స్వాతంత్ర్యభారతం వర్థిల్లాలి…!!
ఇలాంటి మొక్కుబడి దేశభక్తిని చూసి విసిగిపోయి..
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా మేగజైన్

0 comments:

Post a Comment

Search This Blog

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Bluehost Coupons